Praja Palana Dinotsavam celebrations:సెప్టెంబర్ 17వ తేదీని పురస్కరించుకుని రేవంత్ సర్కార్ ప్రజాపాలన దినోత్సవాన్ని పబ్లిక్ గర్డెన్స్‌లో నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా ఆయన రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్వేచ్ఛ సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని జాతి మనదని.. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సువర్ణాక్షరాలతో లిఖించదగిన చరిత్ర: తెలంగాణ పోరాటం ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే నిన్నటి నియంత పాలనకు ముగింపు పలికామని తెలిపారు. తమ పాలనలో బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి మహిళా వీరవనితలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్ అభివృద్ధిపై విజన్: హైదరాబాద్‌ను ప్రపంచానికి ఒక గేట్‌వేగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. కాలుష్యరహిత నగరంగా మార్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మూసీ నదిని పర్యాటక కేంద్రంగా మార్చి దాని చుట్టూ ఉన్న పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. త్వరలోనే మెట్రో విస్తరణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మించనున్నామని ప్రకటించారు. యువతకు శాపంగా మారిన డ్రగ్స్ సమస్యను అరికట్టడానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9న ప్రజలకు అందిస్తామని ఆయన వెల్లడించారు.
గొప్పవిజన్‌తో యంగ్ ఇండియా: దేశానికి తెలంగాణ రోల్‌మోడల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతీ పేదవాడి ముఖంలో సంతోషమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గొప్పవిజన్‌తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు.
గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజును ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా జరుపుకోగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ‘ప్రజాపాలన దినోత్సవం’గా మార్చింది. ఈ మార్పు తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా పరిగణించబడుతోంది. ఈ రోజున హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుంచి విముక్తి పొంది భారత యూనియన్‌లో విలీనమైంది. ఈ చారిత్రక ఘట్టాన్ని తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు వేర్వేరు పేర్లతో పిలుస్తున్నాయి. బీజేపీ ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా పిలుస్తోంది.


