ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం కాపాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. నిజామాబాద్‌లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డుపెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతును బీజేపీ తీసుకుంటోందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ తప్పదని బీజేపీ హెచ్చరించంతోనే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుందని ఆరోపణలు చేశారు.
అమెరికాకు పారిపోయిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును కేంద్ర ప్రభుత్వం దేశానికి ఎందుకు రప్పించడం లేదని నిలదీశారు. వారికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని కోరితే పట్టించుకోలేదన్నారు. ఈ-కార్ రేసింగ్ కేసులో ఈడీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కలిసి రాష్ట్రం అభివృద్ధి కాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 11 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రెండు ఉద్యోగాలు మాత్రమే కేంద్రం ఇచ్చిందని.. అది కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు మాత్రమే అని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వని బీజేపీ పట్టభద్రులు ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు.