Revanth Reddy| మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(Maharashtra Elections) నవంబర్ 20న జరగనున్నాయి. పోలింగ్‌కు కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉంది. ఓవైపు నామినేషన్ల గడువు కూడా ముగిసింది. దీంతో పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. అన్ని పార్టీల కీలక నేతలు సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈసారి మరాఠా ఎన్నికలు నువ్వానేనా అనే రీతిలో సాగుతున్నాయి. ఓవైపు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే తమ కూటమిలకు చెందిన ప్రధాన నేతలను ప్రచార బరిలో దింపుతున్నాయి.
తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ స్టార్ క్యాంపెయినర్‌ల జాబితా విడుదల చేసింది. మొత్తం 40 మందికి ఈ జాబితాలో చోటు కల్పించింది. ఈ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా స్థానం దక్కింది. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకులు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక వాద్రా గాంధీ(Priyanaka Gandhi)తో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పేర్లు ఉన్నాయి. వీరితో పాటు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘాల్, ముకుల్ వాస్నిక్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సచిన్ పైలట్, రణ్‌దీప్ సుర్జేవాలా, జి. పరమేశ్వర, ఎంబీ పాటిల్, కన్హయ కుమార్, అల్కా లాంబా, రాజీవ్ శుక్లా తదితరులు ఉన్నారు.
కాగా 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2021లో శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మెజార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. దీంతో షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కొన్ని నెలల అనంతరం ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి షిండే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. దాంతో అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి ఎన్నికలు తాడేపేడో రీతిలో జరగనున్నాయి. మరి ప్రజలు ఏ కూటమి పట్టం కడతారో తెలియాలంటే నవంబర్ 23వ తేదీ వరకు ఆగాల్సిందే.