మేడిగడ్డ బ్యారేజీ లోపాలపై కేసు వేసిన రాజలింగమూర్తి (47) హత్యకు గురికావడం తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై తీవ్ర దుమారం రేగుతుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు సీఎంవో అధికారులు ఈ హత్యకు గల కారణాలపై పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. ఈ హత్య విషయంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సీఐడీ (CID) విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు కేసులో మాజీ సీఎం కేసీఆర్ (KCR), హరీష్‌రావు (Harish Rao)లకు కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే అనూహ్యంగా రాజలింగమూర్తి బుధవారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఆయన హత్యపై పలు అనుమానాలు రేకిత్తుతున్నాయి. భూవివాదాల కారణంగా హత్య జరిగినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలే హత్య చేయించారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి ఈ హత్య రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.