పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభ (Yuva Vikasam)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ లపై విరుచుకుపడ్డారు. 25 ఏళ్లలో మోదీ గుజరాత్ లో మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా…? చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం అని కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు సవాల్ విసిరారు. “25లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్లు రుణమాఫీ కోసం విడుదల చేసిన చరిత్ర మాది.. గుజరాత్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశారా ఎవరు చర్చకు వస్తారో రండి” అంటూ రేవంత్ బీజేపీ నేతలకి సీఎం ఛాలెంజ్ చేశారు.
కేసీఆర్ బుక్కితే కాళేశ్వరం కూలిపోయింది…
యువ వికాసం (Yuva Vikasam) వేదికగా మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. అక్షరాల 1లక్ష రెండువేల కోట్లు కాంట్రాక్టర్లు మెక్కితే.. కేసీఆర్ బుక్కితే కాళేశ్వరం కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకపోయినా.. 1 కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి తెలంగాణ దేశంలోనే రికార్డు సృష్టించిందని చెప్పారు. పెద్దపల్లి రైతుల కోసం కొట్లాడితే ఆనాడు మా నాయకులను కేసీఆర్ జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ఏ ప్రాజెక్టుల కోసం కొట్లాడామో.. ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకునే అవకాశం మనకు వచ్చిందని అన్నారు. రూ.1035 కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నామంటే అది ప్రజా పాలన వల్లే అని సీఎం చెప్పుకొచ్చారు.