CM Revanth Reddy Delhi Visit: కవిత వ్యవహారం అంతా కుటుంబం, ఆస్తి పంపకాల వివాదమేమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్క ఆడబిడ్డపై నలుగురు కలిసి దాడి చేస్తున్నారని, వారి కుటుంబ వ్యవహారంతో సామాన్య ప్రజలకు ఏం సంబంధం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారని అన్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్.. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-cm-revanth-reddy-in-delhi-to-attract-investments/
ఈ మేరకు పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏమీ లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై బీఆర్‌ఎస్ నేతలకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. ఇంటికొచ్చిన వాళ్లకు కండువా వేస్తే పార్టీ మారినట్లు అవుతుందా అని సీఎం ప్రశ్నించారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి మూడు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు ఏం చెప్తుందో వేచి చూస్తున్నాం. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.’ అని రేవంత్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న గొడవలపై స్పందించిన సీఎం.. అదంతా ఆస్తి పంపకాల వివాదమేనని అభిప్రాయపడ్డారు. 2014- 19 మధ్య కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేరని రేవంత్ అన్నారు. ‘ఉద్యమం పేరుతో కొన్ని వందల మంది పిల్లల ఉసురు పోసుకున్నారు. అది ఊరికే పోదు. హైదరాబాద్ మెట్రో విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే కేటీఆర్ కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ దర్యాప్తు విషయంలోనూ కేటీఆర్, కిషన్ రెడ్డి మధ్య అవినాభావ సంబంధం ఉంది.’ అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.


