CM Revanth Reddy| తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా(Raithu Barosa)పై ప్రతిపక్షాలు చేస్తున్నవిమర్శలకు చెక్ పెట్టారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు. మారీచుల లాంటి రాక్షసుల మాటల నమ్మొద్దని.. సోనియా గాంధీ(Sonia Gandhi) గ్యారంటీగా తాను చెబుతున్నానని విజ్ఞప్తి చేశారు. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని వివరించారు. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామని తెలిపారు.
రైతు రుణమాఫీ ఎలా పూర్తి చేశామో.. రైతు భరోసా కూడా అదేవిధంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్(KCR) బకాయి పెట్టిన రూ.7,625 కోట్ల రైతు బంధు నిధులను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామని గుర్తు చేశారు. అలాగే ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని ఆయన వెల్లడించారు. దేశంలో తొలి నుంచి రైతులకు మేలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమేనని చెప్పారు.
దాదాపు రూ.7లక్షల కోట్ల అప్పుతో కేసీఆర్ తమకు ప్రభుత్వాన్ని అప్పగించారని మండిపడ్డారు. అందుకే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఆస్తులు-అప్పులపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రతి నెలా రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయినా కానీ ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ పాలన సాగిస్తున్నామన్నారు. తన ఏడాది పరిపాలనపై సంతృప్తిగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.