బీఆర్‌ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ స్పీచ్ అంతా అక్కసుతో నిండి ఉందని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలకు కేసీఆర్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానాను లూటీ చేసింది కేసీఆర్ అని మండిపడ్డారు. తాను సీఎం అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిపోయిందని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో తాను చేసిన వ్యాఖ్యలే కేసీఆర్ సభలో పునరావృతం చేశారన్నారు. కేటీఆర్, హరీష్ రావులను చిన్నపిల్లలుగా పేర్కొన్న వ్యాఖ్యలు కూడా కేసీఆర్ తీరుని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మాట్లాడుతూ.. చట్టం మేరకే చర్యలు తీసుకుంటామన్నారు. కేటీఆర్ మీద ఉన్న కేసులు కూడా చట్ట ప్రకారమే సాగిస్తామని స్పష్టం చేశారు. కొంత మంది అధికారుల పనితీరు తెలిసినా అవసరం ఉన్న కారణంగా వారి సేవలను కొనసాగించాల్సి వస్తోందన్నారు.