CM Revanth Reddy deeply saddened by the massive explosion: సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు పాశమైలారం పారిశ్రామికవాడలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇక ఈ ఘటన ప్రాంతాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరస్సింహా పరిశీలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ దుర్ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సీగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగి 10 మంది చనిపోయినట్టు వస్తున్న వార్తలు కలచివేశాయన్నారు. రియాక్టర్ పేలుడు ఘటనలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఘోర ఘటన చాలా దురదృష్టకరం అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. పారిశ్రామికవాడలోని పరిశ్రమల్లో ప్రభుత్వం సేఫ్టీ తనిఖీలు చేయకపోవడం వల్లే ఇటువంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పటాన్ చెరు, పాశమైలారంలోని పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించాలని సూచించారు. ఈ విషయంపై ఎన్ని సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా పాశమైలారంలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో 30 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా.. 10 మంది మృతి చెందారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చింది.