Cm Revanth Reddy delhi tour before Hyderabad jubilee hills by elections results: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బయలుదేరారు. అక్కడ రేపు (గురువారం) ఉదయం 9 గంటలకు యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సమావేశంలో పాల్గొననున్నారు. డిసెంబర్ 8,9 తేదీల్లో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్‌లో ఇండో, యూఎస్ సమ్మిట్ నిర్వహిస్తున్న క్రమంలో ఆయా కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అయి వారిని తెలంగాణకు ఆహ్వానించనున్నారు. ఈ సదస్సులో గూగుల్, మైక్రోసాప్ట్ వంటి దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు మరో 30 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హజరుకానున్నారు. ఆయా కంపెనీలను హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. కాగా, ఈ భేటీ అనంతరం ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం, ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన అనంతరం తొలిసారి సీఎం ఢిల్లీ వెళ్తున్నందున ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ అంతర్గత నిర్మాణంలో భాగంగా డీసీసీల నియామకం వంటి విషయాలపై ఏఐసీసీ నేతలతో చర్చించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు సానుకూలత తెలిపిన నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: https://teluguprabha.net/andhra-pradesh-news/ttd-adulterated-ghee-case-dharma-reddy-turns-approver/
అధిష్టానంతో భేటీలో చర్చకు రానున్న కీలక అంశాలు..
కాగా, నిన్న (మంగళవారం) జరిగిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో 48.47 ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎల్లుండి అనగా నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. జూబ్లీహిల్స్ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కౌంటింగ్పై అన్ని ప్రధాన పార్టీలతో పాటు, తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా వెలువడ్డాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్లనుండటం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యూహత్మకంగా ముందుకు వెళ్లారు. అంతేకాకుండా, తనదైన స్టైల్‌లో బీఆర్ఎస్, బీజేపీలను ఎండగట్టారు. పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ స్ట్రాటజీగా కాంగ్రెస్ ముందుకెళ్లింది. బీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్ పోల్ మేనేజ్‌మెంట్‌లో పైచేయి సాధించిందనే చెప్పవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై, డీసీసీ పార్టీ పదవుల నియామకంపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


