తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను కక్షసాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తిని కాదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేసుకున్నారు. తాను కూడా కక్షపూరిత రాజకీయాలు చేస్తే కేటీఆర్ (KTR) ఇప్పటికే చంచల్‌గూడ జైలులో ఉండేవారన్నారు.
“అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే రూ.500 జరిమానా విధిస్తారు. కానీ డ్రోన్ ఎగరవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారు. రూ.500 జరిమానా వేసే కేసులో జైలులో పెట్టి వేధించారు. 16 రోజుల పాటు జైలులో పెట్టారు. ఉగ్రవాదులు, దేశద్రోహులను పెట్టే డిటెన్షన్ గదిలో నన్ను బంధించారు. రాత్రుళ్లు లైట్లు ఆపకుండా బల్లులు తిరిగేలా చేసేవారు. నా బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిల్‌పై వచ్చి వెళ్లాను. నేను కూడా అలా ప్రతీకార రాజకీయాలు చేయాలనుకుంటే ఇప్పటికే కొందరు జైలులో ఉండేవారు. కేటీఆర్, కేసీఆర్‌ను జైల్లో వేయాలని చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు. కానీ అక్రమ కేసులు పెట్టి వాళ్లను జైలుకు పంపే కక్షపూరిత రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. నన్ను వేధించిన వారిని ఆ దేవుడే ఆస్పత్రి పాలు చేశారు’’ అని రేవంత్ ఎమోషనల్ అయ్యారు.