CM Revanth Reddy expressed happiness: తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గణేష్ నిమజ్జనోత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై అధికారులను అభినందించారు. నిమజ్జనాలు ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
అధికారులకు అభినందనలు: తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలుచేసి.. ఘన వీడ్కోలు పలికారని తెలిపారు. 9 రోజులపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవాలు సాగాయని అన్నారు. హైదరాబాద్ లో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు.
సీఎం నాయకత్వంలో కొత్త మార్పును గమనించిన భక్తులు: హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు క్రమపద్ధతిలో.. నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగాయని అన్నారు. ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్ల సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా ప్రోటోకాల్ పాటించకపోవడంతో.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలతో కలిసి మమేకం అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది ఆయన నాయకత్వ శైలిలో ఒక కొత్త మార్పుగా భాక్తులు భావించారు.
ట్యాంక్ బండ్ వద్ద ఆకస్మిక పర్యటన: సీఎం రేవంత్ రెడ్డి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా.. పరిమిత వాహనాలతో ఒక సాధారణ వ్యక్తిలా ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లారు. నిమజ్జన ఏర్పాట్లను దగ్గర ఉండి మరీ పరిశీలించారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వేదికపై సీఎం: బాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదికపైకి వెళ్లి భక్తులతో కలిసి ‘గణపతి బప్పా మోరియా’ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఒక సభ్యుడు ఇచ్చిన కాషాయ రంగు కండువను సైతం సీఎం రేవంత్ రెడ్డి ధరించారు.
సమన్వయంతో పని చేయాలని సూచన: అధికారులు చేస్తున్న ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. నిమజ్జనం ప్రక్రియ పూర్తయ్యే వరకు అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.
మత సామరస్యాన్ని ప్రశంసించిన సీఎం: గణేష్ ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని మతాల పండుగలను శాంతియుతంగా జరుపుకోవడం ద్వారా హైదరాబాద్ దేశానికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు.
ఉచిత విద్యుత్ సరఫరాపై సీఎం వ్యాఖ్యలు: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


