CM Revanth Delhi Tour | తన ఢిల్లీ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన తరచూ హస్తిన వెళ్లడంపై విమర్శలు, ఊహాగానాలు వెల్లువెత్తుతుండటంపై స్పందించారు. సోమవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ పర్యటనలపై స్పందిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళతానని చెప్పారు.
“నేను ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి మీడియా మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇవాళ్టి నా ఢిల్లీ పర్యటన ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కావడానికి. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదు. రేపు తెలంగాణ లోక్ సభ సభ్యులకు, రాజ్యసభ సభ్యలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సభలో లేవనెత్తాల్సిన అంశాలపై వారితో చర్చిస్తాం.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులను తీసుకొచ్చేందుకు కావాల్సిన కార్యాచరణ రూపొందిస్తాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతుల కోసం రేపు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలుస్తాం” అని సీఎం వెల్లడించారు.
ఇక తన ఢిల్లీ పర్యటనలపై విమర్శలు చేస్తోన్న బీఆర్ఎస్ వర్గాలకు కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. “కొంతమంది అర్రాస్ పాటలా నా పర్యటనకు లెక్కలేస్తున్నారు.. నేనేమీ మీలా మోదీ ముందు మోకరిల్లాడానికి ఢిల్లీవెళ్లడం లేదు.. ఎవరి కాళ్ళో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో, గవర్నర్ అనుమతి ఇవ్వొద్దని కోరేందుకో నేను ఢిల్లీ వెళ్లడం లేదు. గత పదేళ్లుగా తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. కేంద్రం నుచి నిధులు తెచ్చుకోవడం మన హక్కు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు బీజేపీ తన ట్రెజరీ నుంచి ఏం ఇవ్వడం లేదు… కేంద్ర ప్రభుత్వ ట్రెజరీ నుంచే ఇస్తుంది.. రాజకీయ పక్షపాతం చూపకుండా వారిని వెళ్లి కలిసినపుడే నిధులు రాబట్టుకోగలం ఇందుకోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళతాం” అని సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన (CM Revanth Delhi Tour)లపై క్లారిటీ ఇచ్చారు.