కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి(Jana Reddy)తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమావేశమయ్యారు. తెలంగాణలో మావోయిస్టులతో శాంతి చర్చల పునరుద్ధరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులతో చర్చలు జరిగినప్పుడు హోంమంత్రిగా పనిచేసిన జానారెడ్డి అనుభవాన్ని వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రక్రియకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
అలాగే గతంలో శాంతి చర్చల సమయంలో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న దిగ్విజయ్ సింగ్‌తో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో సంప్రదింపులు జరిపారు. మావోయిస్టుల సమస్యను కేవలం శాంతిభద్రతల సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా పరిగణిస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మావోయిస్టులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు లొంగిపోయిన సంగతి తెలిసిందే.