హైదరాబాద్ వాసులకు మరో వంతెన అందుబాటులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌ను ప్రభుత్వం తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరాంఘర్- జూపార్కు మధ్య నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM RevanthReddy) ప్రారంభించారు. నగరం నుంచి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు 4.08 కిలోమీటర్లు మేర రూ.800 కోట్లతో జీహెచ్‌ఎంసీ నిర్మించింది. గతేడాది డిసెంబరులో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసినా కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. ఈ ఫ్లైఓవర్ నగరంలోనే రెండో అతి పెద్ద వంతెనగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఒవైసీ సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధే తెలంగాణ ప్రగతి అన్నారు. గతంలో వైఎస్ హయాంలో 11.5 కి.మీ మేర అతిపెద్ద వంతెన నిర్మాణం జరిగిందని.. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద పైవంతెనను ప్రారంభించామన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పనిచేస్తాయని సీఎం స్పష్టం చేశారు.