హన్మకొండ బాలసముద్రంలో కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఈ కళాక్షేత్రాన్ని ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. అనంతరం అదే ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాళోజీ కళాక్షేత్రంలో కలియతిరిగారు. ఆర్ట్స్ గ్యాలరీ ఫోటో గ్యాలరీలో ఏర్పాటు చేసిన కాళోజీ పుస్తకాలను, చిత్రాలను సందర్శించారు.
కార్యక్రమం అనంతరం కాళోజీ కళాక్షేత్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రభుత్వం ఈ నెల 14 నుండి వచ్చేనెల 9 తేదీ వరకు ప్రజా పాలన ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా.. తమకి బాగా కలిసొచ్చిన వరంగల్ లో ఈరోజు తొలి విజయోత్సవ సభను ఏర్పాటు చేసింది.