Revanth Reddy By Election Strategy: ఓటు హక్కు పవిత్రమైనది. దానిని సద్వినియోగం చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. అయితే కొన్నిసార్లు ఎన్నికలంటే ఉదాసీనత.. మరి కొన్నిసార్లు పోలింగ్ రోజు సెలవు దినమన్న అలసత్వం లాంటివి ఓటింగ్ శాతాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఓటర్ల అసత్వమే అభ్యర్థుల విజయవకాశాల మీద తీవ్ర ప్రభావం చూపనుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి తనదైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. చివరి ఓటు పడేవరకూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి ఓటరునూ పోలింగ్ కేంద్రాలకు చేర్చి, తిరిగి ఇళ్లకు పంపే బృహత్ కార్యాన్ని పార్టీ నేతలు భుజాన వేసుకునేలా ప్రణాళికను రచించారు. ఉదాసీనతకు తావు ఇవ్వొద్దని కాంగ్రెస్ కిందిస్థాయి నేతలను సీఎం రెవంత్ రెడ్డి హెచ్చరించారు.
నేరుగా రంగంలోకి దిగిన సీఎం రేవంత్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హైదరాబాద్ చుట్టూ ఒక్క సీటు కూడా గెలవలేదన్న అపవాదు తుడిచేసుకోవాలని దృఢ సంకల్పంతో ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ నేరుగా రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి పోలింగ్ ముగిసే వరకు ప్రతి దశనూ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు.
మంత్రులతో అంతిమ వ్యూహాలపై చర్చ: పోలింగ్‌కు ముందు రోజు (సోమవారం) సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులతో అల్పాహార విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఇది కేవలం భోజనానికే పరిమితం కాలేదు. ప్రతి డివిజన్‌లో ప్రచార తీరు, ఓటర్ల స్పందన, పార్టీకి అనుకూల అంశాలపై లోతుగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రభావాన్ని మంత్రులు సీఎంకు వివరించారు.
ఓటరు రవాణాపై ప్రత్యేక దృష్టి: పోలింగ్ రోజు చాలా మంది ఓటర్లు సెలవు దినమనే ఉద్దేశంతో ఓటు వేయడానికి ముందుకు రారు. వీరిని పోలింగ్ కేంద్రం వరకూ తీసుకెళ్లడాన్ని ఒక సవాలుగా స్వీకరించాలని సీఎం నేతలకు సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని వారికి కార్యకర్తలు సహాయపడాలని, వారిని పోలింగ్ కేంద్రాలకు చేర్చడానికి వాహనాలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇది ఓటింగ్ శాతాన్ని పెంచడానికి దోహదపడుతుంది.


