CM Revanth Reddy| గురుకులాల్లో చదివిన ఎంతో మంది నేడు కీలక పదవుల్లో కొనసాగుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని సంక్షేమ వసతిగృహాన్ని ఆయన సందర్శించారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల(Welfare Hostels)లో కామన్ డైట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ గురుకులా ప్రక్షాళన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చదివితేనే విద్యార్థులు రాణిస్తారనే అపోహ ఉండేదని.. కానీ దివంగత ప్రధాని పీవీ నర్సింహా రావు(PV Narsimha Rao) హయాంలో తొలిసారిగా సర్వేల్‌లో సంక్షేమ హాస్టళ్లను ప్రారంభించారని గుర్తుచేశారు.
సంక్షేమ హాస్టళ్లలో చదవిన బుర్రా వెంకటేశం, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నేడు కీలక పదవుల్లో ఉన్నారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం 8 ఏళ్లుగా డైట్ ఛార్జీలు పెంచలేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే డైట్ ఛార్జీలు 40శాతం పెంచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అలాగే 16 ఏళ్లగా పెరగని కాస్మోటిక్ ఛార్జీలను 200శాతం పెంచి విద్యార్థులకు అండగా నిలిచామని వెల్లడించారు. విద్యార్థులు తినే ఫుడ్ విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు చనిపోతే బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా తక్కువగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో ఎక్కువమంది చదువుతున్నారని.. ఎక్కువగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం తక్కువమంది విద్యార్థులు చదువుతున్నారని పేర్కొన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల మీద ఖర్చు చేయడం లేదని పెట్టుబడి పెట్టుబడి పెడుతుందన్నారు. విద్యార్థులంతా భవిష్యత్తులో రాష్ట్రాన్ని నడిపించే నాయకులు, అధికారులు అన్నారు.