నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణానికి అంటే 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడుపట్టాలు మంజూరయ్యాయి. ఇందులో విద్యుత్తు సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు.
గిరిజన రైతుకు రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్, తక్కువగా ఉంటే సమీప రైతులను కలిపి బోర్‌వెల్ యూజర్ గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. ఈ నెల 25 వరకు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను గుర్తిస్తారు. జూన్ 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సోలార్ పంపుసెట్ల ఏర్పాటు తదితర పనుల్ని పూర్తి చేస్తారు. తొలి ఏడాదికి 10 వేల మంది రైతులకు చెందిన 27,184 ఎకరాలను సాగులోకి తీసుకువచ్చేందుకు దాదాపు రూ.600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.