Bharat Future City: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ (BFC) ప్రాజెక్టు కార్యాచరణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చారిత్రక శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ముఖ్యమంత్రి ఈ మెగా ప్రాజెక్ట్ పనులను ప్రారంభించారు. భవిష్యత్తులో ఈ నగరం దేశంలోనే సరికొత్త ఆర్థిక, జీవన కేంద్రంగా రూపుదిద్దుకోనుంది.
శంకుస్థాపన సందర్భంగా ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఈ కార్యాలయాన్ని కేవలం నాలుగు నెలల్లోనే, రూ. 20 కోట్ల వ్యయంతో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత ఆధునికంగా నిర్మించనున్నారు. ఫ్యూచర్‌సిటీలో జరిగే సమస్త అభివృద్ధి పనులు, లేఅవుట్లు, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను ఇకపై ఈ ఎఫ్‌సీడీఏ కార్యాలయం నుంచే అధికారులు మంజూరు చేయనున్నారు.
ప్రపంచ స్థాయి మౌలిక వసతులు
హైదరాబాద్ నగరంపై పెరుగుతున్న జనాభా ఒత్తిడిని తగ్గించడం, అలాగే ప్రజలకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవనాన్ని అందించడమే ఈ ఫ్యూచర్ సిటీ ప్రధాన లక్ష్యం. ఈ నగరం దాదాపు 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 56 రెవెన్యూ గ్రామాలు, మూడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంటుంది.
ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ సంస్థల సహకారం లభించడం మరో విశేషం. ప్రపంచబ్యాంకు (World Bank) , జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (JICA) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఈ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ, పర్యావరణహిత నిర్మాణాలు, మెరుగైన రవాణా వ్యవస్థలతో కూడిన ఈ స్మార్ట్ సిటీ, తెలంగాణ అభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని సృష్టించనుంది


