ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital) భవనానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇతర నాయకులతో కలిసి ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. గోషామహల్ స్టేడియంలో సుమారు రూ.2,700 కోట్ల వ్యయంతో 2వేల పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన భవనం నిర్మించనున్నారు. కాగా ప్రస్తుతం ఆసుపత్రి ఆఫ్జల్‌గంజ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
రాబోయే వందేళ్ల అవసరాలకు తగినట్లు ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా.. అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్లకు రూపకల్పన చేశారు.
అండర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్లలో పార్కింగ్, ఆసుపత్రి సమీపంలో ఫైర్ స్టేషన్, ఆసుపత్రి చుట్టూ విశాలమైన రహదారులు, ఆసుపత్రి ప్రాంగంణంలో ఎక్కడికైనా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు తిరిగే మార్గాలు, దివ్యాంగులు ఆసుపత్రిలోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంప్‌లు, ఆసుపత్రిలోని రోగులకు సహాయకులుగా వచ్చే వారు సేద తీరేందుకు డార్మెటరీలు, క్యాంటీన్, మరుగుదొడ్లు వంటి సమస్త సౌకర్యాలతో అత్యాధునికంగా నిర్మించనున్నారు.