CM Revanth Reddy : హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి సినిమా కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముందుకు రావడం పట్ల ఫెడరేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
సినిమా కార్మికుల సమస్యలను ప్రభుత్వం సమస్యలుగానే చూస్తుందని, వ్యక్తిగత పరిచయాలు ఇక్కడ ప్రధానం కాదని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికులు తమ సమస్యలపై కూలంకషంగా చర్చించి ఏం కావాలో ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను కట్టుబడి ఉంటానని, ఈ విషయంలో తాను కార్మికుల పక్షానే ఉంటానని భరోసా ఇచ్చారు.
నైపుణ్యాల పెంపు, ఆరోగ్య బీమా
సినీ కార్మికులలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే, కార్మికులకు ఆరోగ్య బీమా అందించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇటీవల నిర్మాతల సమావేశంలోనూ సినిమా కార్మికులను విస్మరించవద్దని తాను కోరినట్లు గుర్తుచేశారు.
అంతేకాకుండా, అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరిగేలా సహకరించాలని కోరారు. ముఖ్యంగా చిన్న సినిమా నిర్మాతలకూ సహకరించాలని సూచించారు. సమ్మెల వల్ల రెండు వైపులా నష్టం జరుగుతుందని, సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం కార్మికుల తరపున నిర్మాతలతో చర్చలు జరుపుతుందని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా తమ సమస్యలు వినడం పట్ల కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.


