CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో, ముఖ్యంగా రెండు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఒకటి, హైదరాబాద్‌లోని గాంధీ సరోవర్ ప్రాజెక్టు, రెండు, రాష్ట్రంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో మూసీ, ఈసీ నదుల సంగమం వద్ద “గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ” ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన 98.20 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆయన రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. ఈ ప్రాజెక్టు జాతీయ సమైక్యతకు, గాంధేయ విలువలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం వంటివి నిర్మిస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌కు కొత్త కళను తీసుకువస్తుందని, పర్యాటకంగానూ ప్రాధాన్యతను సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చాకలి ఐలమ్మకు సీఎం నివాళి
ఢిల్లీలో ఉన్నప్పటికీ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ అణచివేత, దమనకాండపై ధిక్కార పతాకాన్ని ఎగురవేశారని కొనియాడారు. 80 ఏళ్ల క్రితమే తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత అని గుర్తు చేశారు. సమ్మక్క, సారలమ్మ, చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. చాకలి ఐలమ్మ వంటి వీరవనితల త్యాగాలే నేటి తెలంగాణ రాష్ట్రానికి పునాది అని ఆయన అన్నారు. వారి పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, చాకలి ఐలమ్మ చేసిన త్యాగాలు, ఆమె పోరాటం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవి అని ఆయన పేర్కొన్నారు


