Sunday, December 8, 2024
HomeతెలంగాణCM Revanth Reddy on cyber crime and drugs: సైబ‌ర్ క్రైమ్‌, డ్ర‌గ్స్...

CM Revanth Reddy on cyber crime and drugs: సైబ‌ర్ క్రైమ్‌, డ్ర‌గ్స్ నివార‌ణ‌లో స‌మ‌ర్థంగా ప‌ని చేసిన వారికి ప్ర‌మోష‌న్లు

స‌మాజాన్ని పీడిస్తున్న స‌మ‌స్య‌లు మాద‌క ద్ర‌వ్యాలు.. సైబ‌ర్ నేరాలే

ప్ర‌స్తుతం స‌మాజాన్ని ప‌ట్టి పీడిస్తున్న అతి పెద్ద స‌మ‌స్య‌లు సైబ‌ర్ నేరాలు, మాద‌క ద్ర‌వ్యాలేన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఒక‌ప్పుడు హ‌త్య‌, అత్యాచారాలు పెద్ద నేరాలుగా ఉండేవ‌ని, హ‌త్య‌తో ఒక‌రే చ‌నిపోతార‌ని, కానీ మాద‌క ద్ర‌వ్యాల (డ్ర‌గ్స్‌) ప్ర‌భావంతో ఒక త‌రం ప‌నికిరాకుండాపోతుంద‌న్నారు. తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 కార్లు, 54 ద్విచ‌క్ర వాహ‌నాలు, తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరోకు (టీజీ న్యాబ్‌) 27 కార్లు, 59 ద్విచ‌క్ర వాహ‌నాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయించింది. క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆ వాహ‌నాల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -

అనంత‌రం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల పోరాటం, వంద‌లాది మంది విద్యార్థులు, ఉద్య‌మ‌కారుల బ‌లిదానాల‌తో తెలంగాణ ఏర్ప‌డింద‌న్నారు. తెలంగాణ స‌మాజం తొలి నుంచి పోరాట ప‌టిమ క‌ల్గిన స‌మాజ‌మ‌ని, సామాజిక అస‌మాన‌త‌ల‌పై పోరాడే త‌త్వం ఇక్క‌డ ఉంద‌ని ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. ఉద్య‌మాల‌కు చిరునామా అయిన తెలంగాణ‌లో డ్ర‌గ్స్ మాట వినిపించ‌కూడ‌ద‌ని ముఖ్య‌మంత్రి పోలీసు అధికారుల‌కు సూచించారు. గ‌త ప్ర‌భుత్వ ప‌దేళ్ల‌ నిర్ల‌క్ష్యంతో గంజాయి వినియోగం గ‌ల్లీగ‌ల్లీలో పెరిగిపోయింద‌ని ముఖ్య‌మంత్రి విమ‌ర్శించారు. క‌ళాశాల‌ల‌తో పాటు ఇత‌ర ప్రాంతాల్లోనూ గంజాయి అమ్మ‌కాలు సాగుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉన్న‌త వ‌ర్గాల వారే కాకుండా పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు సైతం గంజాయికి బానిస‌లు అవుతున్నార‌ని, ఇటీవ‌ల హ‌త్య‌లు, చిన్న పిల్లల‌పై దాడులకు కార‌ణ‌మైన వారిని ప‌రిశీలిస్తే వారిలో అత్య‌ధికులు గంజాయికి బానిస‌లైన‌వారిన‌నే తేలింద‌న్నారు. డ్ర‌గ్స్‌, సైబ‌ర్ నేరాల సంఖ్య పెర‌గ‌డంతో వాటిని ఎదుర్కోవ‌డానికి అవ‌స‌ర‌మైన నిధులు, అధికారుల‌ను పోలీసు శాఖ‌కు కేటాయించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆధునిక కాలంలో అందివ‌చ్చిన సాంకేతిక‌త‌ను, నైపుణ్యాల‌ను నేర‌గాళ్లు వినియోగించుకుంటున్నార‌ని, వారిని ఎదుర్కోవాలంటే అంత‌కుమించిన నైపుణ్యాలు, సాంకేతిక‌త‌ను పోలీసులు అందిపుచ్చుకోవాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. సైబ‌ర్ మోసాలు, డ్ర‌గ్స్ బారిన కేవ‌లం అమాయ‌కులు, పేద‌లే కాకుండా ఉన్న‌త విద్యావంతులు, వృత్తి నిపుణులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు సైతం ప‌డుతున్నార‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. తెలంగాణ యువకులు డ్రగ్స్‌కు బానిసలు కాద‌ని, సమస్యలపై పోరాటం చేసే సమర్థులుగా ఉండాలని ముఖ్య‌మంత్రి ఆకాంక్షించారు. సైబ‌ర్ మోసాలు, నేరాల బారిన ప‌డిన వారికి స‌హాయం అందించేందుకు 1930 పేరుతో 24 గంట‌లు ప‌ని చేసే కాల్ సెంట‌ర్ ఏర్పాటు చేశామ‌న్నారు. కొద్ది కాలంలోనే సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో రూ.31 కోట్ల‌ను నేర‌గాళ్ల నుంచి రాబ‌ట్టి బాధితుల‌కు అంద‌జేసింద‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. అందులో భాగ‌స్వాములైన సిబ్బందికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. గ‌తంలో ఉగ్ర‌వాదం, తీవ్ర‌వాదంపై పోరాటం చేసిన వారికి, ఆ నేరాలు అరిక‌ట్టిన వారికి ప్ర‌మోష‌న్లు ఇచ్చేవార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్ర‌స్తుతం సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాను అరిక‌ట్ట‌డంలో
స‌మ‌ర్థంగా ప‌ని చేసిన పోలీసు సిబ్బందికి ప్ర‌మోష‌న్లు ఇచ్చే బాధ్య‌త త‌మ ప్ర‌భుత్వం తీసుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సైబ‌ర్ నేరాగ‌ళ్ల‌ను ప‌ట్టుకున్న వారిని, సైబ‌ర్ నేరాలు అడ్డ‌కున్న‌వారికి, డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాను అడ్డుకున్న వారిని, డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసే వారిని ప‌ట్టుకున్న వారికి ప్ర‌మోష‌న్లు క‌ల్పించే విధివిధానాలు త‌యారు చేయాల‌ని డీజీపీ ర‌విగుప్తాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దానిపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చించి సంబంధిత చ‌ట్టం చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. తెలంగాణ‌లో డ్ర‌గ్స్ మాట విన‌ప‌డితేనే వెన్నులో వ‌ణుకు పుట్టాలే చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాట వినిపిస్తుంటుంద‌ని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ బాధితులతో ఉండాల‌ని, నేర‌గాళ్ల‌తో కాద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. బాధితుల‌కు న‌మ్మకం క‌లిగించేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాల‌ని, అలాకాకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో నేర‌గాళ్ల‌తోనూ ఫ్రెండ్లీగా ఉంటే పోలీసు శాఖ‌పై ఉన్న విశ్వాసం స‌న్న‌గిల్లుతుంద‌ని, ఈ రెండింటి మ‌ధ్య తేడాల‌ను గుర్తించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

  • సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందు…
    డ్ర‌గ్స్‌తో క‌లిగే న‌ష్టాల‌పై ఇటీవ‌ల ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి ఓ వీడియో తీసి పంపార‌ని, ఆయ‌న‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చిరంజీవిని ఇత‌ర న‌టులు ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌తి సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందు ఆ సినిమాలో న‌టించే
    తారాగ‌ణంతో సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్ దుష్ప‌లితాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ఒక‌టిన్న‌ర రెండ నిమిషాలు నిడివి గ‌ల్లిగ‌న వీడియోల‌ను తీసి ఉచితంగా ప్ర‌ద‌ర్శించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. సినిమా థియేట‌ర్ల‌లోనూ ఈ రెండు ర‌కాల వీడియోల‌ను ఉచితంగా ప్ర‌ద‌ర్శించాల‌ని థియేట‌ర్ య‌జ‌మానుల‌కు ముఖ్య‌మంత్రి సూచించారు. సినిమా అనేది రూ.వంద‌ల కోట్ల పెట్టుబ‌డితో చేసే వ్యాపార‌మ‌ని, వారి వ్యాపారాన్ని తాము కాద‌న‌మ‌ని, కానీ అదంతా ప్ర‌జ‌ల నుంచే వ‌చ్చేద‌నే విష‌యం గుర్తుంచుకోవాల‌న్నారు. సినిమా విడుద‌ల‌కు ముందు డ్ర‌గ్స్‌, సైబ‌ర్ నేరాల అవ‌గాహ‌న వీడియోలు ప్ర‌ద‌ర్శిస్తేనే సినిమా టిక్కెట్ ధ‌ర‌ల పెంపు, ఇత‌ర అనుమ‌తులు ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. సమాజాన్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యత సినీ పరిశ్రమపై ఉందన్నారు. మీడియా సైతం రాజ‌కీయ వివాదాల‌పై కాకుండా సామాజిక స‌మ‌స్య‌ల‌పైనా దృష్టిసారించాల‌ని ముఖ్య‌మంత్రి హిత‌వుప‌లికారు. డ్ర‌గ్స్‌, సైబ‌ర్ నేరాల‌పై టీవీలు, ప‌త్రిక‌ల్లో అప్పుడ‌ప్పుడు ఉచితంగా ప్ర‌క‌ట‌న‌లు వేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. మీడియా సామాజిక బాధ్య‌త‌గా ఈ అంశాన్ని ప‌రిగ‌ణించాల‌ని ఆయ‌న కోరారు. కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రాజ‌కీయ స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, డీజీపీ ర‌వి గుప్తా, ఇంటెలిజెన్స్ అడిష‌న‌ల్ డీజీపీ బి.శివధ‌ర్‌రెడ్డి, టీజీ న్యాబ్ డీజీ సందీప్ శాండిల్య‌, సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్ట‌ర్ శిఖా గోయ‌ల్‌, హైద‌రాబాద్‌, సైబారాబాద్‌, రాచ‌కొండ క‌మిష‌న‌ర్లు శ్రీ‌నివాస‌రెడ్డి, అవినాష్ మహంతి, త‌రుణ్ జోషి త‌దిత‌రులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News