Wednesday, January 14, 2026
HomeతెలంగాణCM Revanth Reddy: కొట్లాటలు వద్దు.. కూర్చొని పరిష్కరించుకుందాం.. సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: కొట్లాటలు వద్దు.. కూర్చొని పరిష్కరించుకుందాం.. సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy on Krishna River: రాజకీయ వివాదాల కంటే సమస్యల పరిష్కారానికే తాము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. “రాష్ట్రానికి కొట్లాటలు, పంచాయితీలు కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటాను” అని వ్యాఖ్యానించారు. కృష్ణా నది జలాల వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు సృష్టించవద్దని, అడ్డంకుల వల్ల కేంద్ర నిధులు రాక రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలన్నా, నీటి సమస్యలు తీరాలన్నా ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల సహకారం అవసరమని, అందుకే తాము వివాదాల కంటే సామరస్యపూర్వక చర్చలకే మొగ్గు చూపుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల, రైతుల ప్రయోజనాల కోసమే తమ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.

- Advertisement -

క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ డెవలప్‌మెంట్‌ మోడల్‌తో..

ఇక, రాష్ట్ర అభివృద్ధి కోసం క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు విభాగాలుగా డెవలప్‌మెంట్ మోడల్‌ను రూపొందించినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇప్పటికే తెలంగాణ పాలసీ డాక్యుమెంట్‌ను విడుదల చేశామని, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ అంతిమ లక్ష్యమన్నారు. హైదరాబాద్ నగరం నేడు ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతోందంటే అది గత మూడు దశాబ్దాల (1995-2025) నిరంతర శ్రమ ఫలితమేనని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. జర్మన్ టెక్నాలజీతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఐవీ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సందర్భంగా సుజెన్ మెడికేర్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా ఇటువంటి తయారీ యూనిట్లు రావడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం వాటా తెలంగాణదేనని, ఫార్మా రంగంలో ప్రపంచమే మన వైపు చూసేలా ఎదగడం గర్వంగా ఉందన్నారు. కాగా, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌లోని ‘ఫ్యూచర్ సిటీ’లో నివసిస్తున్నామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలతో పోటీ పడుతూ తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్‌గా మార్చడమే తమ సంకల్పమని సీఎం పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News