ఓఆర్ఆర్(ORR) టెండర్లపై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. వేల కోట్ల ఓఆర్ఆర్ ఆస్తిని అప్పన్నంగా అమ్ముకున్నారని బీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు. ప్రజలు ఓడించబోతున్నారని తెలిసి.. దేశం విడిచిపెట్టి పోవాలనే ఉద్దేశంతోనే ఓఆర్ఆర్ ఆస్తులను అమ్మేసుకున్నారని ఆరోపించారు.
అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ మారడానికి కాంగ్రెస్ కారణమని తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జైకా నుంచి నిధులు తెచ్చి ఓఆర్ఆర్ నిర్మించారని తెలిపారు. అలాగే ఎయిర్‌పోర్టు, ఓఆర్ఆర్, ఐటీ కంపెనీలు, మెట్రో రైలు తీసుకొచ్చి హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేసింది కాంగ్రెస్ అన్నారు.
కాగా ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణకు సీఎం ఆదేశించడంపై హరీశ్‌రావు స్పందించారు. తాను విచారణ కోరలేదని.. అయినా కూడా విచారణను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే ముందు టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని వెల్లడించారు.