CM Revanth Reddy Press meet: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు నేపథ్యంలో హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కీలక నిర్ణయాలను సీఎం గుర్తు చేశారు.
జలయజ్ఞానికి చిహ్నం కాంగ్రెస్ పాలన: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్ ఫైల్‌పై చేసిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అంతే కాకుండా వైఎస్‌ఆర్ రైతులపై ఉన్న కేసులను మాఫీ చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతే కాకుండా వ్యవసాయాన్ని ‘దండుగ కాదు.. పండుగ’ చేయాలనే లక్ష్యంతో ఉచిత కరెంటును తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. జలయజ్ఞానికి చిహ్నం కాంగ్రెస్ పాలన అని రేవంత్ రెడ్డి తెలిపారు. తుమ్మిడిహట్టి, ప్రాణహిత-చేవెళ్ల, ఎస్సారెస్పీ, మిడ్ మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల వంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగాయని అన్నారు. ఒకప్పుడు ఎండాకాలంలో మంచినీటి ఎద్దడి ఉండేదని.. అయితే పి.జనార్థన్ రెడ్డి చొరవతోనే కృష్ణాజలాలను హైదరాబాద్‌కు తీసుకురావడం సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు. రోశయ్య, కిరణ్ కుమార్ హైదరాబాద్‌కు కృష్ణ నీళ్లు తీసుకొచ్చారని తెలిపారు. నాడు పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన గుడ్ గవర్నెన్స్ కారణంగానే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని తెలిపారు. అందుకే రాష్ట్ర విభజన సమయంలో ఏపీ వాసులు అభ్యంతరం చెప్పారని అన్నారు. హైదరాబాద్ ఆదాయంలో కూడా వాటా అడిగారని గుర్తు చేశారు.
వాస్తు మారిస్తే ఏమోస్తుంది: కేటీఆర్‌ను సీఎం చేసేందుకే నాటి కేసీఆర్ ప్రభుత్వం నూతన సచివాలయంను నిర్మించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ దశ, దిశ సరిగా లేనప్పుడు వాస్తు మారిస్తే ఏమోస్తుందని ఎద్దేవ చేశారు. కేసీఆర్ కొడుకు జీవితంలో సీఎం రేఖ లేనే లేదని అన్నారు. తెలంగాణ సమాజానికి ఏ ఒక్క ఉద్యోగం రాని సచివాలయం, కమాండ్ కంట్రోల్ రూమ్‌లను కేసీఆర్ నిర్మించారని రేవంత్ రెడ్డి అన్నారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని కేటీఆర్ అవమానించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కుటుంబసభ్యులను సరిగా చూడలేనోడు ప్రజలను ఏలా చూసుకుంటాడని కేటీఆర్‌ను ఉద్ధేశించి అన్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ హైదరాబాద్‌కు కృష్ణ నీళ్లు తీసుకొస్తే.. ఆ కృష్ణ జలాలను కేసీఆర్ కుటుంబం నెత్తి మీద చల్లుకుని వాళ్లే తెచ్చినట్టు చెప్పుకున్నారని ఎద్దేవ చేశారు. రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుతో తమకు అప్పగించారని.. అయినప్పటికీ ఆ అప్పులు కడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కిషన్‌రెడ్డి నా మీద ఒంటికాలిపై లేస్తున్నారు: కేటీఆర్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెడు స్నేహం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరు కలిసి మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నారని అన్నారు. మెట్రో విస్తరణకు సైతం సహకరించడం లేదని ఆరోపించారు. గుజరాత్‌కు కిషన్‌రెడ్డి ఎందుకు గులాంగిరీ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరెత్తని కిషన్‌రెడ్డి నా మీద మాత్రం ఒంటికాలిపై లేస్తున్నారని అన్నారు.


