ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే(Savitribai Phule) ఆశయాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఆమె 194వ జయంతిని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సావిత్రి బాయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కుల వివక్ష, అణగారిన వర్గాల ఉన్నతికి పాటుపడిన వీరనారి, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి అని తెలిపారు. పూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సావిత్రి బాయి ఆశయ సాధనకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు.