చిలుకూరు బాలాజీ ఆలయం(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకుడు రంగరాజన్(Rangarajan)పై దాడి జరిగిన ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. అర్చకులు రంగరాజన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. దాడి జరిగిన తీరుపై ఆరా తీసి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రామ రాజ్యం పేరుతో దాడులు చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.
మరోవైపు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారిపై జరిగిన దాడిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan reddy) కూడా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు స్థానం లేదన్నారు. అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.