Chevella bus Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విచారం వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటన జరగడం అత్యంత విషాదకరమన్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్, డీజీపీని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు ఘటనాస్థలికి వెళ్లి పర్యవేక్షించాలని కోరారు.
దిగ్బ్రాంతికి లోనైన పలువురు మంత్రులు: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాద ఘటన పట్ల రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి.. దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మంత్రి పొన్నం ఫోన్‌లో మాట్లాడారు. ఆర్టీసీ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి: చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ సర్కార్ ను కోరారు.
24 మంది మృతి:రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెంటనే స్పందించిన పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈ ఘటన జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 70 మంది ప్రయాణికులతో వెళ్తోంది. ఆ సమయంలో కంకరతో వెళ్తున్న టిప్పర్ వేగంగా వచ్చి బస్సును ఢీ కొట్టింది. కంకర పడిపోవడంతో బస్సులోని ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కంకర నుంచి ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నాలు స్థానికులు చేపట్టారు.






