తెలంగాణ ఆర్టీసీలో అమీన్ అహ్మద్ అన్సారీ అనే వ్యక్తి కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతడు ఏడు అడుగులు ఎత్తు ఉండటంతో బస్సులో విధులు చేయడం కష్టంగా మారింది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) దృష్టికి వచ్చింది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు అతనికి ఆర్టీసీలో సరైన ఉద్యోగం ఇవ్వాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar)కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో తక్షణమే స్పందించి అతడికి అవకాశం కల్పించిన మంత్రికి, సీఎంకి నెటిజన్లు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా 7 అడుగుల ఎత్తు ఉన్న అమీన్ అహ్మద్ అన్సారీ మెహదీపట్నం డిపోలో ఆర్టీసీ బస్ కండక్టర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఏడడుగుల పొడవు ఉండటంతో విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా మారింది. బస్సుల్లో రోజూ ఐదు ట్రిప్పుల్లో పది గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోందని.. గంటల తరబడి తలవంచి ప్రయాణిస్తుండటంతో మెడ, వెన్ను నొప్పి, నిద్రలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఎం దృష్టికి వచ్చింది.