హైదరాబాద్ తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక సమావేశం నిర్వహించారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో జలమండలి, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపు పైన చర్చించారు.
కొండపోచమ్మ , మల్లన్న సాగర్ ప్రాజెక్టు ల నుంచి నీటి తరలింపు పైన సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఏ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపునకు ఎంత వ్యయం అవుతుంది, నీటి లభ్యత పైన పూర్తి అధ్యయనం చేయాలని సూచించారు. వచ్చే నెల 1 వ తేదీ వరకు టెండర్లకు వెళ్లేలా కార్యచరణ రూపొందించాలన్నారు. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకి సూచించారు. సమీక్షలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ప్రశాంత్ జె. పాటిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.