తెలంగాణ కేబినెట్ విస్తరణ (TG Cabinet Expansion)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యనటలో ఉన్న అధిష్టానం పెద్దలను కలిశారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు. ఇక కులగణన ఆశామాషీగా చేసింది కాదని.. ఎంతో పకడ్బందీగా చేశామన్నారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తామని తెలిపారు. త్వరగా అరెస్టు చేయించి జైలులో వేయాలనే ఆలోచన లేదని రేవంత్ వెల్లడించారు.
అంతకు ముందు పార్లమెంట్‌లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge)ను రేవంత్ రెడ్డి కలిశారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం పని తీరు, తాజా రాజకీయ పరిస్థితులపై ఖర్గేకు వివరించినట్లు సమాచారం. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఉన్నారు. ఇక ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal)తోనూ చర్చలు జరిపారు.