CM Orders pass to party leaders: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు పరిధిలో ఉండగానే స్థానిక సంస్థల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ జూమ్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలపై అందరూ దృష్టి పెట్టాలని అన్నారు. ఇన్‌ఛార్జి మంత్రులు ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో ఉండాలని ఆదేశించారు. ఎవరూ హైదరాబాద్‌లో ఉండొద్దని కోరారు. క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
రాజకీయ ప్రకటనలు చేయొద్దు: స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి అన్ని ప్రాంతాల ఎమ్మెల్మేలతో ఇన్‌ఛార్జి మంత్రులు మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నామినేషన్ల విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే.. వెంటనే లీగల్ సెల్‌ను సంప్రదించాలని కోరారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఇచ్చే తీర్పుపై దృష్టి పెట్టాలని తెలిపారు. కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే కార్యాచారణ ప్రారంభించాలని అన్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అభ్యర్థులను ఖరారు చేసి బీ ఫారం ఇవ్వాలని అన్నారు. నో డ్యూ పత్రాలు ఇప్పించాలని కీలక నేతలకు ఆదేశించారు. ఇన్‌ఛార్జి మంత్రులు.. పార్టీ ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయాలని ఆదేశించారు. తొలి విడత కోసం నేటి రాత్రికి అభ్యర్థుల తుది జాబితా సిద్ధం కావాలని తెలిపారు. ఎంపీపీ , జెడ్పీ ఛైర్మన్ పదవుల ఎంపికపై.. టీపీసీసీ చర్చించి తుది నిర్ణయం తీసకుంటుందని అన్నారు. అప్పటి వరకు ఎవరూ రాజకీయ ప్రకటనలు చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు.


