Saudi road accident: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందడంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలని అధికారుల ఆదేశించారు. ప్రయాణికుల్లో రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలను సేకరించాలని సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డికి సూచించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సౌదీ ఎంబసీతో మాట్లాడాలని సీఎం ఆదేశించారు. మృతి చెందిన కుటుంబాలకు సహాయ కార్యక్రమాలను అందించాలని సూచించారు. మరోవైపు బస్సు ప్రమాదంపై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
- తెలంగాణ సచివాలయంలో: +91 79979 59754, +91 99129 19545.
- జెడ్డాలోని భారతీయ ఎంబసీలో: 80024 40003
రియాద్‌లో భారత ఎంబసీతో మాట్లాడా: సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన వివరాల కోసం రియాద్‌లో భారత ఎంబసీతో మాట్లాడినట్లు అసదుద్దీన్ తెలిపారు.హైదరాబాద్‌కు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలతో సైతం కాంటాక్ట్ అయినట్లు పేర్కొన్నారు. 44 మంది యాత్రికులు మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను భారత్‌కు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ను కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీయులే: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారతీయ ప్రయాణికులతో మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న బస్సును.. డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దారుణ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులు సజీవదహనం అయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. బదర్ – మదీనా మధ్యనున్న ముఫరహత్ ప్రాంతంలో అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుందని సౌదీ అరేబియా ప్రకటించింది. మృతుల్లో అధికంగా భారతీయులు ఉన్నారని అక్కడి అధికారులు తెలిపారు. వీరిలో హైదరాబాదీయులే ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మరణించిన వారిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.
16 మంది హైదరాబాదీయులే: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మృతుల వివరాల కోసం సౌదీ ఎంబసీని సంప్రదించినట్టుగా మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం మృతుల్లో దాదాపు 16 మంది తెలంగాణ వాళ్లు ఉన్నట్లు తెలుస్తోందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మరణించిన 16 మంది మల్లేపల్లి బజార్‌ఘాట్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్టు తెలిపారు.




