తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తండ్రి కుమారి అనంతన్(Kumari Ananthan) మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహాత్ముడి సిద్ధాంతాలను ఉనికిపుచ్చుకున్న గొప్ప దేశ భక్తుడు, తమిళ భాషా ప్రేమికుడు, అనంతన్‌ని కోల్పోవడం ఎంతో బాధాకరం అని పేర్కొన్నారు. కుమారి అనంతన్ నాలుగు సార్లు శాసనసభకు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఇక తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న తమిళసై సౌందరరాజన్, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని వెల్లడించారు.