మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ (DK Aruna) ఇంట్లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేరుగా డీకే అరుణకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఘటనపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందులో కుట్ర కోణం దాగి ఉందని తనకు వెంటనే భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆమెకు భద్రత పెంచాలని పోలీస్ శాఖు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
కాగా శనివారం అర్థరాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డీకే అరుణ నివాసంలోకి గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించాడు. ఇంట్లోని కిచెన్, హాల్, సీసీ కెమెరాలు ఆఫ్ చేయడంతో పాటు ముసుగు, గ్లౌజులు ధరించి ఏకంగా ఇంట్లోకే చొరబడ్డాడు. సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే తిరిగాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది డీకే అరుణ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.