Local body elections: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై అంతా గందరగోళం నెలకొంది. హైకోర్టు స్టే విధించడంతో అధికార పార్టీలోని కింది స్థాయి శ్రేణులు అయోమయంలో పడిపోయారు. అసలు హైకమాండ్ బీసీలకు న్యాయం చేయాలనుకుంటుందా.. లేదా ఈ అంశంతో కాలయాపనకు ప్రయత్నిస్తుందా తెలియక కింది కేడర్ అయోమయంలో పడిపోయింది. కాంగ్రెస్ అంటేనే కాలయాపన అని గ్రామాల్లో సాధారణ ఓటర్లు చర్చించుకోవడంతో .. ఏం చేయాలో పాలుపోని స్థితి ఏర్పడిందని కింది స్థాయి పార్టీ శ్రేణులు వాపోతున్నారు.
గగ్గోలు పెడుతున్న గ్రామ స్థాయి నేతలు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండేళ్లు అవుతున్నా గ్రామ స్థాయి నేతలకు హైకమాండ్ ఎలాంటి భరోసా ఇవ్వలేక పోతుంది. అటు పార్టీ పదవులు కానీ, ఇటు నామినేటెడ్ పదవులు కానీ లేకపోవడంతో గ్రామీణ నేతల్లో తీవ్ర నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సైతం బ్రేకులు పడడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పార్టీ శ్రేణులు ఉన్నారు. ఎన్నికల విషయంలో ఇప్పటికే ఆలస్యం అయ్యిందని గగ్గోలు పెడుతున్నారు. పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో గ్రామాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని హైకామాండ్‌కు సంకేతాలు ఇస్తున్నారు. అయితే హైకామండ్ మాత్రం తనదైన వ్యూహాలతో ముందుకు పోతుంది.
రేవంత్‌రెడ్డి అంతు చిక్కని వ్యూహాలు: సీఎం రేవంత్‌రెడ్డి అంటేనే ఊహకందని ఎత్తుగడలకు నిలువెత్తు నిదర్శనం. తన ప్రతీ ఆలోచన రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుచిక్కని విధంగా ఉంటుంది. రాజకీయ చదరంగంలో మాజీ సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తినే బోల్తా కొట్టించాడంటే.. తన రాజకీయ చతురతను మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా మరోసారి తను రాజకీయ చతురతను చాటుకుంటున్నారు. అధికార పార్టీ నేతలకు సైతం రేవంత్ ఎత్తగడలు అర్థం కావడంలేదు. ఎందుకంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఏ మేరకు అమలవుతాయన్న దానిపై కాంగ్రెస్ గ్రామీణ నేతలకు అస్సలు అంతుచిక్కడంలేదు. రేవంత్ అనుసరిస్తున్న వైఖరి ఓ స్థాయి నాయకత్వం వరకు మాత్రమే చేరగా.. సాధారణ కార్యకర్తల్లో మాత్రం అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని ఆ పార్టీ నేతలే కోడై కూస్తున్నారు.
న్యాయస్థానాలకు సైతం అర్థకాని ప్రభుత్వ విధానాలు: గ్రామాల్లో ఇప్పటికే పాలన పూర్తిగా గాడి తప్పింది. పంచాయతీల వ్యవహారాలు మొత్తం స్తంభించాయి. పాలనకు నిధులు లేక పంచాయతీ కార్యదర్శులు సైతం ఆందోళనకు దిగారు. దీంతో మూడు నెలల క్రితం.. హైకోర్టు అక్టోబర్ చివరి నాటికి ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని రేవంత్ సర్కార్‌ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లుగా ప్రకటించింది.. కానీ కాంగ్రెస్ అంటేనే కాలయాపన అని మరోసారి రుజువు చేసుకుంది. రాష్ట్ర ప్రజలతో పాటు న్యాయస్థానాలను సైతం రేవంత్ సర్కార్ ఆలోచనలో పడేసింది. అమలుకు సాధ్యపడని 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని ముందు వేసుకుని.. తనదైన వ్యూహాలతో రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలకు వెళ్లారు. నిజానికి రిజర్వేషన్ల అంశం రాజ్యాంగపరమైనది. కేంద్ర ప్రాభుత్వం పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ ద్వారా చేయాల్సిన రిజర్వేషన్లను.. రేవంత్ సర్కార్ జీవో ద్వారా అమలు చేయాలని చూసిందంటేనే అర్థం చేసుకోవచ్చు. దీంతో ఎన్నికలు తప్పనిసరిగా అక్టోబర్‌లో నిర్వహించాలని ఆదేశించిన న్యాయస్థానమే .. ఎన్నికల నిర్వహణను ఆపేల.. జీవో నెంబర్ 9పై స్టే ఇచ్చింది. దీంతో రైవంత్ తనదైన వ్యూహలతో పోతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అనుభవం శూన్యం.. వ్యూహల్లో మాత్రం సాటి లేరు: సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఎన్నడూ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం లేదు. కానీ తాను కింది స్థాయినుంచి రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి. జెడ్పీటీసీ స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఈ అనుభవమే ఇప్పుడు గ్రామాల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టింది. యూరియా లోటుతో రైతులు ప్రభుత్వంపై చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అంతే కాకుండా ఆటోవాలాలు, మహిళలు కూడా ప్రభుత్వంపై వ్యతిరేతకతో ఉన్నారు. అంతే కాదు నిరుద్యోగులు సైతం రేవంత్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతే ఓటమి తప్పదని రేవంత్ సైన్యం పసిగట్టింది. అందుకే ఎన్నికలకు వెళ్లినట్లేవెళ్లి .. రిజర్వేషన్‌లల పేరుతో ఎన్నికలను వాయిదా వేసేలా వ్యూహాలు పన్నారని స్థానిక నేతలు కోడైకూస్తున్నారు.


