Saturday, November 15, 2025
HomeతెలంగాణEducation : తెలంగాణ విద్యకు కొత్త దిశ.. దేశానికే ఆదర్శం కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

Education : తెలంగాణ విద్యకు కొత్త దిశ.. దేశానికే ఆదర్శం కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

Telangana new education policy : “మన విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలవాలి. పేదరిక నిర్మూలనకు విద్యే ఏకైక మార్గం. ఈ యజ్ఞంలో రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా నేను సిద్ధం.” – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు, తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రక్షాళనపై ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతున్నాయి. ఏటా లక్షల మంది ఇంజినీర్లు బయటకు వస్తున్నా, ఉద్యోగాలు దక్కని దైన్యం, ప్రభుత్వ బడులపై ప్రజల్లో సన్నగిల్లుతున్న నమ్మకం.. ఈ నేపథ్యంలో, రాష్ట్ర విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఆవేదనకు కారణాలేంటి..? ఆయన ప్రతిపాదిస్తున్న మార్పులేంటి..?

- Advertisement -

అంతర్జాతీయ స్థాయికి సరితూగట్లేదు :నూతన విద్యా విధానంపై ఉన్నతాధికారులు, విద్యావేత్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత విద్యా వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఉద్యోగాల కొరత: “ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తుంటే, వారిలో కేవలం 15 శాతం మందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఇది మన విద్యా ప్రమాణాలకు నిదర్శనం,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బడ్జెట్ లెక్కలు: “విద్యాశాఖకు బడ్జెట్‌లో రూ.21 వేల కోట్లు కేటాయిస్తే, అందులో 98 శాతం నిధులు కేవలం ఫ్యాకల్టీ జీతాలకే సరిపోతున్నాయి. ఇక మౌలిక సదుపాయాల కల్పన ఎప్పుడు?” అని ఆయన ప్రశ్నించారు.

తగ్గుతున్న ప్రభుత్వ పాత్ర: అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగకపోవడానికి, విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమంగా తగ్గిపోవడమే కారణమని సీఎం అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ బడులపై అసహనం : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల మధ్య ఉన్న తీవ్ర అంతరంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు.

“తెలంగాణలో 11 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 34 లక్షల మంది చదువుతుంటే, 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 18 లక్షల మందే చదువుతున్నారు. ఈ పరిస్థితి మారాలి. పాఠశాల విద్యలో 1 నుంచి 12వ తరగతి వరకు సమూల మార్పులు రావాలి.”
– రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

కేంద్రానికి కీలక విజ్ఞప్తి : విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత అడ్డంకిగా మారకూడదన్న ఉద్దేశంతో, సీఎం కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు. విద్య కోసం రాష్ట్రాలు తీసుకునే రుణాలను, ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM – ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ) పరిధి నుంచి మినహాయించాలని కోరినట్లు తెలిపారు.

73 లక్షల మంది యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే తన లక్ష్యమని, ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, ప్రొఫెసర్ కోదండరాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి వంటి ప్రముఖులు పాల్గొని, తమ సూచనలు అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad