Saturday, November 15, 2025
HomeతెలంగాణCongress: అలిగిన కొండా సురేఖ.. రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి!

Congress: అలిగిన కొండా సురేఖ.. రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి!

CM gives instructions to ministers: తెలంగాణలో గత కొంతకాలంగా మంత్రుల మధ్య ఉండే అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మొన్నటి పొన్నం, అడ్లూరి నుంచి నిన్నటి పొంగులేటి, కొండా సురేఖ మధ్య జరుగుతున్న వివాదాలు చినికిచినికి గాలివానలా మారుతున్నాయి. దీంతో ప్రతిపక్షాలకు తిరుగులేని ఆయుధాలను మంత్రులే ఇస్తున్నట్టుగా.. కింది స్థాయి కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో.. మంత్రుల విభేదాలు మరింత వ్యతిరేకతను సృష్టిస్తున్నయని వాపోతున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు.

- Advertisement -

వాపోతున్న కొండా దంపతులు: మేడారం అభివృద్ధి పనుల టెండర్‌లలో చోటుచేసుకున్న వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. సోమవారం రోజు అభివృద్ధి పనులను పరిశీలించడానికి వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో మంత్రి సీతక్క మాత్రమే వెళ్లారు. దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ లేకపోవడంతో.. మళ్లీ పొంగులేటితో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఇప్పటికే తన శాఖపై మంత్రి పొంగులేటి జోక్యంతో కొండా సురేఖ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ అంశంపై పార్టీ హైకమాండ్‌కు సైతం ఫిర్యాదు చేశారు. కానీ.. అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడుతున్న తమకే విలువ లేకుంటే ఎలా అని.. తన అనుచరులతో కొండా దంపతులు వాపోతున్నారు. ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సిన పార్టీ పెద్దలు తమని ఒంటరి చేశారని మంత్రి సురేఖ బాధపడుతున్నట్టుగా.. కొండా అనుచరులు పేర్కొన్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలో దిగారు.

మంత్రులకు స్వీట్ వార్నింగ్‌: ఇటీవల పార్టీలో చోటుచేసుకుంటున్న విభేదాలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మంత్రుల మధ్య జరిగే అంతర్గత విభేదాలు రచ్చకెక్కడంతో కాంగ్రెస్‌ పార్టీతోపాటు ప్రభుత్వానికి తీవ్రనష్టం జరుగుతున్నట్టుగా రేవంత్‌ రెడ్డి గుర్తించారు. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా పార్టీలోని విభేదాలను పరిష్కరించే చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి పలువురు మంత్రులతో రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి.. పలు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఇకపై మంత్రులు ఎవ్వరూ మీడియా ఎదుట వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించినట్టు సమాచారం. మంత్రులకు పాలన పరంగా కానీ..లేదా ఇతర ఏ అంశంపైనా గానీ అనుమానాలు ఉంటే స్వయంగా తనతోనే మాట్లాడాలని మంత్రులకు సూచించినట్టుగా తెలుస్తోంది. అంతర్గత విభేదాలు ఉంటే.. సానుకూల దృక్పథంతో కూర్చోని మాట్లాడుకోవాలి తప్పా.. మీడియా సమావేశాల్లో మాట్లాడొద్దని పలువురు మంత్రులకు స్వీట్ వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

వివాదాలకే ఎక్కువ ప్రాముఖ్యత: ఇది సామాజిక మాధ్యమాల యుగమని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పేర్కొన్నట్టు సమాచారం. మన ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. అవి పెద్దగా ప్రచారం కావడంలేదు. కానీ చిన్న చిన్న వివాదాలే ఎక్కవ ప్రచారంలో ఉన్నాయని తెలిపారు. విభేదాలకే మీడియాలో ఎక్కువ ప్రాముఖ్యత దొరుకుతుందని మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారని సామాచారం. ఇప్పటికైనా ఎలాంటి విభేదాలకు తావులేకుండా.. క్రమశిక్షణతో వ్యవహరించాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇకపై సమన్వయంతో పనిచేస్తూ.. కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపేందుకు కృషి చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad