CM Revanth Reddy warning to Private colleges: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ల పేరుతో విద్యార్థులకు నష్టం చేసేవారిని ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో గత ఐదు రోజులుగా ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ సమాధానమిచ్చారు.
‘విద్యార్థులకు నష్టం చేసేవారిని ఉపేక్షించం. ఇప్పుడు కాలేజీలు బంద్ పెట్టిన వాళ్లే పైరవీలకు వచ్చారు. కాలేజీలు బంద్ చేసిన వాళ్లతో చర్చలు ఎలా జరుపుతాం. కాలేజీల్లో సదుపాయాలు పరిశీలించాలని చెప్పడం తప్పా. నిబంధనల ప్రకారం కాలేజీలు నడపడానికి మీరు సిద్ధమా. ఏది పడితే అది చేస్తే ఊరుకోవాలా.?’ అని సీఎం రేవంత్ రెడ్డి కాలేజీ యాజమాన్యాలపై మండిపడ్డారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. తమాషాలు చేస్తే తాట తీస్తానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని బకాయిలు ఉన్నాయో అవి ఇస్తామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఉన్న బకాయిల గురించి వారినే అడగాలని సూచించారు. ఉన్న రూ. 3,600 కోట్లకు బదులు రూ. 5000, 6000 కోట్లు అడగడం సరికాదన్నారు. కాలేజీలు బంద్ పెట్టి విద్యార్థులను చదువుకు దూరం చేయవద్దనన్నారు. కొత్త విద్యాసంవత్సరంలో ఫీజులు అడగకుండా ఉంటారా.. వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దామని సీఎం రేవంత్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
‘బకాయిలు ఈ రోజు కాకపోతే రేపు చెల్లిస్తాం. కళాశాలలు బంద్ పెడితే విద్యార్థులు కోల్పోయిన సమయం తిరిగి వస్తుందా. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులకు ఇబ్బంది లేదు. కానీ అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. రాష్ట్రానికి నెలకు రూ. 18 వేల కోట్లు ఆదాయం వస్తుంటే.. జీతాలు, వడ్డీలు, పథకాలు, ఇతర ఖర్చులు పోనూ రూ. 5 వేల కోట్లు మిగులుతుంది. ఆ డబ్బుతో రాష్ట్రాన్ని ఎలా నడపాలి. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తే ఎలా అని’ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడ్డగోలుగా ఫీజులు పెంచి రీయింబర్స్‌మెంట్‌లు చెల్లించమని అడుగుతున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటూ పోతే ఎలా అన్నారు. విద్యను వ్యాపారంగా భావించవద్దని.. సేవగా చూడాలని సూచించారు. కాలేజీలకు అనుమతుల విషయంలో ఎన్నో అక్రమాలున్నాయన్నారు. బీసీ నేత కృష్ణయ్య వాళ్ల ఉచ్చులో పడ్డారని.. మందకృష్ణ మాదిగతో పాటు కృష్ణయ్య నా ముందుకు వస్తే వాళ్ల చేతికే చిట్టా ఇస్తా అని స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఐదో రోజు ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న అధ్యాపకుల సభకు సైతం పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య హైకోర్టును ఆశ్రయించినా వారికి ఊరట దక్కలేదు.


