Revanth Reddy| తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘ఈ రోజు గ్రూప్ -3 పరీక్షకు హాజరవుతున్న ఉద్యోగార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పరీక్షలో మీరు విజయం సాధించి.. కొలువుల కలలను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ తెలిపారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-3(Group-3) పరీక్షలు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించే ముందు గుర్తింపు కార్డులను తనిఖీ చేసి పంపించారు. అయితే ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను మాత్రం అధికారులు అనుమతించలేదు. రాష్ట్రంలోని 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి రాతపరీక్షలు జరుగుతున్నాయి.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష.. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఇక రేపు అనగా నవంబర్ 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ(TGPSC) అధికారులు వెల్లడించారు. గ్రూప్-3 పోస్టులకు పరీక్షలు రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.