CM Revanth Reddy with British High Commissioner: విద్యా, సాంకేతిక రంగాల్లో తెలంగాణకు మరింత సహకారం అందించడంతో పాటు రాష్ట్రానికి చెందిన ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇచ్చేందుకు బ్రిటన్ హైకమిషనర్ లిండీ కామరూన్ అంగీకరించారు. యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్షిప్‌ను కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. నేడు (గురువారం) జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో బ్రిటన్ హైకమిషనర్ లిండీ కామరూన్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ యూనివర్సిటీల్లో చదివే తెలంగాణ విద్యార్థుల గురించి ముఖ్యమంత్రి వీరితో చర్చించారు. రాష్ట్రంలో తీసుకురాబోతున్న నూతన విద్యా విధానం డ్రాఫ్ట్‌ను సీఎం వారికి వివరించారు. ఈ సందర్భంగా నూతన సాంకేతికతపై రాష్ట్ర ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు బ్రిటిష్ హై కమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు. యూకేలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం అక్కడి యూనివర్సిటీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని సీఎం కోరారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటన్ కంపెనీలు భాగస్వామ్యం కావాలని, బీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఆహ్వానించారు. సీఎం విజ్ఞప్తులపై బ్రిటిషన్ హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ- యూకే మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని రఘురామన్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
CM Revanth Reddy: సీఎం నివాసంలో బ్రిటీష్ హైకమిషనర్ భేటీ.. యూకేలో చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్..!
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


