CM Revanth Reddy: మాదిగలకు తాను అన్యాయం జరగనివ్వనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని దస్పల్ల హోటల్‌లో జరిగిన గ్లోబల్ మాదిగ డే-2024(Global Madiga Day -2024) కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉందని..మాదిగలకు న్యాయం చేసే బాధ్యత తనదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో న్యాయవాదులను నియమించామన్నారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంలో ప్రభుత్వం క్రియాశీల పాత్ర పోషించిందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తుందని శాసనసభ వేదికగా ప్రకటించామన్నారు. అయితే తెలంగాణ విభజన సమస్యలా ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా జఠిలంగా మారిందన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేలా అధ్యయనం చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామన్నారు. మరో వారం రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. కాగా మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారని ఆయన గుర్తు చేవారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలియజేశామని రేవంత్ వెల్లడించారు.