తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల(Satya Nadella) భేటీ ముగిసింది. ఐటీశాఖ మంత్రి మంత్రి శ్రీధర్‌బాబు, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి బంజారాహిల్స్‌లోని నాదెళ్ల నివాసానికి సీఎం చేరుకున్నారు. అనంతరం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు విషయాల గురించి ఇరువురు చర్చించారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని రేవంత్ రెడ్డి కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఏఐ సిటీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటులో మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషించాలని కోరారని సమాచారం. అలాగే ఐటీ స్టార్టప్‌ల రంగంలో మైక్రోసాఫ్ట్ మద్దతును కూడగట్టే అంశంపై ఆయనతో చర్చించారు. ఇక మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కేంద్రంలో 4 వేల ఉద్యోగాలు వచ్చే విధంగా ఇటీవల ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో దాని పురోగతిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని సత్య నాదేళ్లను కోరారు. కాగా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో సత్య నాదెళ్ల భేటీ కావడం ఇదే తొలిసారి.