Hyderabad Rains- Revanth Reddy:హైదరాబాద్‌లో వరుసగా కురుస్తున్న వర్షాలు నగర వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. పెరుగుతున్న వర్షపు నీరు జంట జలాశయాలకు చేరడంతో గేట్లు ఎత్తివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో మూసీ నది ప్రవాహం మరింత ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మూసీ పరివాహక ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందో సంబంధిత అధికారులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు.
లోతట్టు ప్రాంతాలన్నిటిలో..
సీఎం సూచనల మేరకు లోతట్టు ప్రాంతాలన్నిటిలో అప్రమత్తత చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన అధికారులకు సూచించారు. అవసరమైతే తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు చెప్పారు.
అర్ధరాత్రి సమయానికి నగరంలోని ఇమ్లిబన్ ప్రాంతంలో ఉన్న ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ నీళ్లు చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితిని స్వయంగా సీఎం రేవంత్ సమీక్షించారు. సహాయక చర్యలు వేగంగా జరిగేలా అధికారులతో నిరంతరం ఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రయాణికులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకున్నారు.
ఆర్టీసీ తగిన ఏర్పాట్లు..
మూసీ పరివాహకంలో నీరు పెరగడంతో నగర రవాణా వ్యవస్థపై కూడా ప్రభావం చూపింది. ఎంజీబీఎస్‌కు వచ్చే బస్సులను ఇతర మార్గాలకు మళ్లించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా బతుకమ్మ, దసరా పండుగల సమయంలో జిల్లాలకు వెళ్ళే ప్రజలు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
పోలీస్ శాఖ, ట్రాఫిక్ విభాగం..
నగరంలో వరుసగా రెండో రోజు కూడా భారీ వర్షాల అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ, ట్రాఫిక్ విభాగం, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ వంటి అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
మూసీ పక్కన నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న ప్రాంతాల్లో తగిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రజలు, వాహనాలు ఆ దిశగా వెళ్లకుండా దారి మళ్లింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సిటీ లోని నీరు నిలిచే ప్రదేశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం కోరారు. ప్రజలు ఇబ్బంది పడకుండా అవసరమైన చోట పంపింగ్ యంత్రాలు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.


