CM Revanth: హైదరాబాద్ నగరం ఆరోగ్య, ఔషధ రంగాల్లో ఒక కీలక కేంద్రంగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ “లిల్లీ” కంపెనీ కొత్త సెంటర్‌ను గచ్చిబౌలిలో ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి దానం నాగేందర్ సహా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో తయారయ్యే ఔషధాలు, టీకాలు ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. రాష్ట్రం ఔషధ తయారీ రంగంలో దూసుకెళ్తోందని, దీనికి తోడుగా ఫార్మా కంపెనీల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన “జీనోమ్ వ్యాలీ” కూడా ఇక్కడే ఉందని ఆయన గుర్తు చేశారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అనుకూల వాతావరణం నెలకొని ఉందన్నారు. “రైజింగ్ తెలంగాణ 2047” అనే దృష్టితో రాష్ట్రం అభివృద్ధి బాటలో కొనసాగుతోందని చెప్పారు. ఫార్మా రంగంతో పాటు మెడికల్ టెక్నాలజీలోనూ తెలంగాణ ప్రత్యేక హబ్‌గా రూపుదిద్దుకుంటోందని ఆయన పేర్కొన్నారు.


