Revanth Reddy About Padma Shri to Andesri: ప్రముఖ రచయిత, కవి అందెశ్రీ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి. అంతిమయాత్రలో పాల్గొన్నారు. లాలాపేట్ నుంచి ఘట్‌కేసర్ వరకు కొనసాగిన అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అందెశ్రీ పాడె మోశారు. ఆయనకు కన్నీటి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మట్లాడారు.
‘ఓ కళాకారుడిగా, రచయితగా అందెశ్రీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా పనిచేశారు. ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అందెశ్రీ గొప్ప పాత్ర పోషించారు. ఆయనను కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. గద్దర్ అన్నతో పాటు అందెశ్రీ కూడా ప్రజల్లో స్పూర్తి నింపారు.’ అని సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.

అందెశ్రీ రాసిన ప్రతీ పాట తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపిందని సీఎం రేవంత్ అన్నారు. అందుకే ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన పేరుతో ఓ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆయన పాటల సంకలనం “నిప్పుల వాగు” ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని.. అందుకే 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతీ లైబ్రరీలో “నిప్పుల వాగు”ను అందుబాటులో ఉంచుతామని సీఎం వెల్లడించారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన పాటలతో అలుపెరుగని కృషి చేసిన అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గత ఏడాది కేంద్రానికి లేఖ రాశామని సీఎం రేవంత్ అన్నారు. ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. ఆయనకు పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనను పద్మశ్రీతో గౌరవించుకునేందుకు కృషి చేద్దామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.


