మేడ్చల్‌లోని సీఎంఆర్(CMR) ఇంజనీరింగ్ కాలేజీ ఘటన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన నంద కిశోర్, గోవింద్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. దురుద్దేశపూర్వకంగా అమ్మాయిల బాత్రూమ్‌ల్లో కెమెరాలు పెట్టినట్లు గుర్తించారు. దీంతో కిశోర్, గోవింద్‌తోపాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలపై విద్యార్థినులు ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోనందుకు కాలేజీ చైర్మన్ చామకూర గోపాల్‌రెడ్డి, డైరెక్టర్ మాదిరెడ్డి జంగారెడ్డి, ప్రిన్సిపల్ అనంతనారాయణ, వార్డెన్ ప్రీతిరెడ్డి, క్యాంపస్ వార్డెన్ ధనలక్ష్మిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్(Women Commission) సుమోటాగా స్వీకరించి విచారణకు ఆదేశించింన సంగతి తెలిసిందే. మహిళా కాలేజీ హాస్టల్లో బాత్రూంలోని దృశ్యాలను చిత్రీకరించిన అంశంపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీని కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద ఆదేశించారు. మరోవైపు హాస్టల్ వార్డెన్ ప్రీతి రెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాగా బాత్రూంలో రహస్యంగా కెమెరాలు పెట్టి రికార్డు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం విధితమే.