Coconut price hike in Telangana : దేవుడికి మొక్కు చెల్లించాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కొబ్బరికాయ. మనసులోని కోరికను స్వామికి విన్నవించుకోవాలన్నా, తీరిన కోరికకు కృతజ్ఞత చెప్పుకోవాలన్నా టెంకాయ కొట్టాల్సిందే. కానీ ఇప్పుడు ఆ దేవుడి ప్రసాదం భక్తుల పాలిట భారంగా మారింది. కొండెక్కిన కొబ్బరి ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అసలు ఈ ధరల పెరుగుదలకు కారణమేంటి? కేవలం ప్రకృతి ప్రకోపమా లేక వ్యాపారుల మాయాజాలమా? ఈ భారం భవిష్యత్తులో మరింత పెరగనుందా? ఆ వివరాల్లోకి వెళ్తే…
అమాంతం రెట్టింపైన ధర : ఏడాది వ్యవధిలోనే కొబ్బరికాయ ధర సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. 2023లో రూ.15 పలికిన సాధారణ కొబ్బరికాయ ధర, 2024 ఆరంభంలో రూ.20కి చేరింది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో టెంకాయను రూ.35 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు.
పండగలు, ప్రత్యేక రోజుల్లో అయితే ఈ ధర మరింత పెరుగుతోంది. ఇక ఆలయాల వద్దైతే పరిస్థితి చెప్పనక్కర్లేదు. వేలం ద్వారా దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు, అసలు ధరపై మరో పది రూపాయలు అదనంగా వేసి అమ్ముతూ భక్తుల భక్తిని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ధరల దోపిడీపై దేవాదాయ శాఖ గానీ, ఇతర అధికారులు గానీ కళ్లెం వేసేవారే కరువయ్యారని భక్తులు వాపోతున్నారు.
తుపాన్ల దెబ్బ.. మరింత భారం : ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన భారీ తుపాన్లను వ్యాపారులు చూపిస్తున్నారు. తుపాన్ల కారణంగా కొబ్బరి తోటలు వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయని, దిగుబడి గణనీయంగా పడిపోయిందని చెబుతున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి, ధరలు పెంచక తప్పడం లేదని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, ఏడాది చివరి నాటికి కొబ్బరికాయ ధర రూ.50కి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని విక్రయదారులు అంచనా వేస్తున్నారు.
బోండం తాగాలంటే భయమే : ఈ ప్రభావం కేవలం పూజలకే పరిమితం కాలేదు. వేసవిలో సేదాతీర్చే కొబ్బరి బోండం ధర కూడా భగ్గుమంటోంది. వచ్చే వేసవి నాటికి ఒక్కో కొబ్బరి బోండం ధర దాదాపుగా రూ.80 వరకు చేరవచ్చని అమ్మకందారులు చెబుతున్నారు. దీంతో కొబ్బరి నీళ్లు కూడా వారికి దూరమవుతాయేమోనని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లెక్కల ప్రకారం, దాదాపు 2,300 ఆలయాల్లో భక్తులు రోజుకు సగటున 1.15 లక్షల కొబ్బరికాయలు కొనుగోలు చేస్తారు. పెరిగిన ధరల వల్ల కేవలం ఈ ఒక్క జిల్లాలోనే భక్తులపై రోజుకు రూ.18 లక్షలకు పైగా అదనపు భారం పడుతోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కొబ్బరి ధర పెరగడంతో ఎండుకొబ్బరి, కొబ్బరి ఆయిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.


